ఆంధ్రప్రదేశ్ మరలా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది -కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
ఉలవపాళ్ళ వినాయకుడుని దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నాయకుల కృషి వల్ల ఆంధ్రప్రదేశ్ మరలా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామంలోని ప్రతిష్ఠిత గణనాధుడిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బుధవారం రాత్రి దర్శించుకున్నారు. వినాయక ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉలవపాళ్ల గ్రామ అభివృద్ధికి ఇప్పటికే 25 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రామన్న చెరువు సమస్యలను పరిష్కరించేందుకు 63 కోట్ల రూపాయల ఎస్టిమేట్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. త్వరలోనే ఎంఎస్ఎంఈ పార్క్ కోసం 24 ఎకరాల భూమిని తీసుకొని, గ్రామ ప్రజలకు తగిన పరిహారం చెల్లించి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
కావలి నియోజకవర్గానికి రామాయపట్నం పోర్టు, దామవరం ఎయిర్‌పోర్టు, జువ్వలదిన్నె హార్బర్, బిపిసిఎల్ ఇండస్ట్రీ, ఇండో సోలార్ ప్రాజెక్ట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి అవకాశాలకు దారితీస్తాయని చెప్పారు. మిత్రుడు బత్తల వెంకట తేజ ఆధ్వర్యంలో గ్రామ యువత, కమిటీలు కలసి ఎంతో అద్భుతంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించారని ప్రశంసించారు. గ్రామ యువకులు తమ కష్టాన్ని, సమయాన్ని వెచ్చించి ప్రజలందరికీ ఆనందం పంచే కార్యక్రమాలు అందించారని, ఇది పల్లెల్లో సాంస్కృతిక వాతావరణానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. ఉలవపాళ్ల గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని, ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని బయట నుంచి రప్పించాల్సిన అవసరం లేకుండా స్వయంగా గ్రామంలోనే ప్రతిష్ఠితమైన గణనాధుడు ఎప్పటికీ ఊరిని కాపాడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు.
అందుకే ఈ గ్రామం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుందని, ఇక్కడి పిల్లలు ఉన్నత విద్యను పొంది ఉద్యోగాల్లో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ముందంజలో ఉన్నారని అన్నారు. గణనాధుడి రూపకల్పనలోని ప్రత్యేకతను ఎమ్మెల్యే వివరిస్తూ, మనిషికి లభించిన మానవ జన్మ గొప్పదని, ఆ జన్మలో సనాతన ధర్మాన్ని ఆచరించడం ద్వారా సమాజంలో సత్సంగతులు పెంపొందుతాయని చెప్పారు. వినాయకుని రూపంలో ఉన్న లక్షణాలను మనం అలవరచుకోవడం వల్ల జీవితం సాఫల్యవంతం అవుతుందని, ప్రతి సంవత్సరం వినాయక చవితి మనకు ఆ బోధనే చేస్తుందని అన్నారు.
గ్రామ ప్రజలు ఎప్పుడూ తనపై చూపుతున్న అభిమానాన్ని గుర్తుంచుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎప్పుడూ కట్టుబడి ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ జనసేన ఇంచార్జి అలహరి సుధాకర్, టిడిపి దగదర్తి మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, జలదంకి శ్రీహరి నాయుడు, దగదర్తి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెంకట్ యాదవ్, స్థానిక నాయకులు బత్తల వెంకట తేజ, పోలిశెట్టి శ్రీనివాసులు, పొట్టేళ్ల శ్రీనివాసులు, సాల్మాన్, చల్లా రాంబాబు, కప్పల సుబ్బయ్య, కప్పల మనోజ్, మామిడాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.